న్యూఢిల్లీః దేశీయ మీడియా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశీయ మీడియా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం వుంది.
న్యూస్, కరెంట్‌అఫైర్స్ విభాగాల్లో 26 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించాలని నాన్ న్యూస్, నాన్ కరెంట్‌అఫైర్స్ విభాగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడికి అనుమతించాలని నిర్ణయించినట్టుగా సమాచార ప్రసారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. మంగళవారం నాడు ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆమె వెల్లడించారు. పత్రికల్లో ఎడిటోరియల్ నియంత్రణ మాత్రం భారతీయుల చేతుల్లోనే వుండాలని నిబంధన విధించినట్టుగా ఆమె చెప్పారు. అంతేకాకుండా ఎడిటోరియల్ ఉద్యోగాల్లో మూడింటరెండు వంతుల పోస్టులను భారతీయులతోనే నింపాల్సి వుంటుంది.