వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలిజానికి కాలం చెల్లింది: సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తుపాకి గొట్టం ద్వారా రాజ్యస్థాపన ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతమని, నక్సలైట్ల సిద్దాంతానికి కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. హింసకుస్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన నక్సలైట్లనుకోరారు. నక్సలైట్లు చేసిన తప్పులను ప్రభుత్వం, ప్రజానీకం క్షమిస్తాయని ఆయన అన్నారు. తిరుమలలోని అలిపిరి సంఘటన తర్వాత ఆయన గురువారం తొలిసారి ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ ద్వారాపార్టీ అధ్యక్షుడితో ముఖాముఖి కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.

నక్సలైట్లకు పునరావాసం కల్పించడం, వారికి ఉపాధి చూపించడం కష్టం కాదని, అయితే నక్సలైట్లు తుపాకి రాజ్యం చేయాలని చూస్తున్నారని, హింసను వదిలిపెట్టి రావాలని కోరినా వినడం లేదని, ఇదిపెద్ద సమస్య అని ఆయన అన్నారు. దానికి తోడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయనవిమర్శించారు. గురువారంనాటి కార్యక్రమంలో ఎక్కువగా తనపై నక్సలైట్లు జరిపిన దాడి, నక్సలైట్ల చర్యలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ప్రజాస్వామ్యంలో తీవ్రవాదం పనికి రాదని ఆయన స్పష్టం చేశారు. హింస వల్ల అభివృద్ధి జరగబోదని, హింసకు, అభివృద్ధికి,పేదరికానికి అవినాభావ సంబంధం ఉన్నదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజాపోరాటాల ద్వారా, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం ద్వారా వ్యక్తం చేయాలని, హింస ద్వారా కాదని ఆయన అన్నారు.

కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడిపోయాయని, కొన్ని వర్గాలు సామాజిక, ఆర్థిక అసమానతలకు గురవుతున్నారని, ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం, అన్ని వర్గాలను సమాన స్థాయిలో ముందుకు తీసుకురావడం అవసరమని,అందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.విచ్ఛిన్నం చేయడం సులభమని, నిర్మాణాత్మకంగా ముందుకు సాగడం కష్టమని ఆయన అన్నారు. నిర్మాణాత్మక కృషి చేపట్టేందుకు నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

పిఎం పదవిపై ఆశలేదు

తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తన చివరి రక్తంబొట్టు వరకు రాష్ట్ర ప్రజలకే ధారపోస్తానని ఆయన అన్నారు. ఒక ప్రయోజనం కోసం భగవంతుడు తనకు పునర్జన్మను ప్రసాదించాడని, ఆ ప్రయోజనం నెరవేరుస్తానని, ప్రజల సంక్షేమానికే తన జీవితం అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ఎవరి మీద తనకు వ్యక్తిగత కక్షలు లేవని, కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగత ద్వేషాలకు అతీతంగా తాను పని చేస్తానని ఆయన చెప్పారు. తనకు వ్యసనాలేవీ లేవని, పని చేయడమే తనకున్న వ్యసనమని ఆయన అన్నారు. తనతో పాటు అందరినీ పని చేయించాలనేది తన ప్రయత్నమని ఆయన చెప్పారు. తాను ప్రాణార్పణ చేయడం ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే అందుకు తాను సిద్ధమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X