జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
ఏపీ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ సీఎంలు ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత , మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో నిప్పు ఉప్పు మాదిరిగా ఉన్న నాయకులు నేడు అలై బలయ్ చేసుకుంటూ కనిపించారు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
దీనిలో భాగంగానే మాజీ సీఎంలు ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ముగ్గురు నేతలు కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. చంద్రబాబు తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తరువాత చంద్రబాబు టీడీపీలో చేరడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువుగా మారిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి సైతం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం చాలాసార్లు చూశాం.

వైఎస్ఆర్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివిరి ముఖ్యమంత్రిగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇప్పటి సీఎం జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం సొంతంగా పార్టీ పెట్టడం జరిగింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టగా...అప్పటి ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడారు.

ఆ తరువాత రాష్ట్రం విడిపోవడం.. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బయటకు వచ్చేయడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీకి ఏపీలో ఉనికి లేదని భావించిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో బీజేపీ , టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట పార్లమెంట్ స్థానం దక్కింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. వీరితో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ వారితో సెల్ఫీ తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజమే అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత సీఎంను ఓడించడానికి ఇద్దరు మాజీ సీఎంలు ఒకటైన పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications