వార్‌తో కాంగ్రెస్‌ చెలిమి: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 22-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులు తీవ్రవాదులతో చేతులు కలుపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలతో కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌) సంబంధాలుపెట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. తీవ్రవాదులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రభుత్వ ఉద్యోగులను హతమారుస్తుంటే కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆయన అన్నారు.

నెలకు ఒక మారు జరిగే డయల్‌ యువర్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ ద్వారా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఆవకాశవాదంతో తీవ్రవాదులకు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తీవ్రవాదులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో హింసకు పాల్పడుతున్నారని ఆయనవిమర్శించారు. తీవ్రవాదులు ఆ రకంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తీవ్రవాదుల సహకారంతో కాంగ్రెస్‌ ఓట్లు సాధించుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.

తాము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని, తన పునర్జన్మ ప్రజలకే అంకితమని ఆయన అన్నారు. ప్రజల మేలు కోసం కృషి చేయాలని నాకు ప్రాణసమానమైన పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా, సర్వాంధ్రగా తీర్చి దిద్దేవరకు విశ్రమించకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రాణత్యాగాలకైనా సిద్ధపడాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ఆయన వేర్పాటువాదంగా కొట్టిపారేశారు. సమైక్యాంధ్ర కోసం కట్టుబడి ఉండాలని, సమైక్యాంధ్రలోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కున్నామని, ఈ ఎనిమిదేళ్లలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి