పులిచింతలకు అడ్డంకులు తొలిగినట్లే: సతీష్‌చంద్ర
న్యూఢిల్లీ: కృష్ణా నదిపై తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం అభిప్రాయపడుతోంది. ఈ ప్రతినిధి బృందం బుధవారంనాడు పర్యావరణ నిపుణుల కమిటీతో సమావేశమైంది. తాము చెప్పిన విషయాలకు కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి కార్యదర్శి సతీష్‌చంద్ర విలేకరులతో చెప్పారు. కమిటీ వ్యక్తం చేసిన సందేహాలకు తాము సంతృప్తికరమైన సమాధానాలిచ్చామని ఆయన అన్నారు. కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు.
విశాల దృక్పథంతో ఆలోచిస్తే పులిచింతల ఎంతో ప్రయోజనకరమైందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. పులిచింతల ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 100 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. పులిచింతల నిర్మాణం వల్ల నల్లగొండ, గుంటూరు జిల్లాల్లోని 21 గ్రామాలు, 21 వేల మెట్ట ప్రాంతం ముంపునకు గురవుతాయని, నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications