వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాధించి తీరుతాం: విజయశాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సినీనటి విజయశాంతి ప్రకటించారు. హైదరాబాద్‌లోని మారుతీ గార్డెన్‌లో జరిగిన సభలో ఆమె ఆవేశపూరితంగా మాట్లాడారు. బిజెపియా, తెలంగాణ అనే సమస్య తన ముందుకు వచ్చిందని, తెలంగాణ కోసం ముందుకు రావాలని నిర్ణయించుకున్నాని సినీనటి విజయశాంతి చెప్పారు. తాను చాలా ఓపిక పట్టానని ఆమె చెప్పారు. ఈ విషయం ప్రకటించే సమయంలో ఆమె కంటతడి పెట్టారు. బిజెపికి తనకు ఎటువంటి సంబంధం లేదని, చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడుతానని ఆమె ప్రకటించారు. తెలంగాణ పేరు మీద మోసం చేయడానికి చూసే ఎవరినీ వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసం పార్టీని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే ఆమె పార్టీని ప్రకటించలేదు.

తెలంగాణ మీద ప్రేమ ఉంటే రాజీనామా చేసి రావాలని ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకుడు చంద్రశేఖర్‌ రావును ఆమె విజ్ఞప్తి చేశారు. చంద్రశేఖర్‌ రావును తాను శాసించడం లేదని, వారికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె అన్నారు. మనం ఐక్యంగా ఉండాలని, మధ్యలో ఎవరైనా దూరితే చంపేయాలని ఆమె అన్నారు. ఈ ఉద్యమాన్ని దెబ్బ కొట్టడానికి చాలా మంది కంకణం కట్టుకున్నారని, ఇది ప్రజల ఉద్యమమని ఇక్కడ ఎవరూ ఎవరినీ మోసం చేయలేరని, తాను చాలా మొండిదాన్ననని ఆమె అన్నారు. తెలంగాణ సాధించి తీరుతామనే నమ్మకం తనకు ఉన్నదని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఉపాధి, అభివృద్ధి, ప్రశాంత జీవనమని సినీనటి విజయశాంతి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు చేసింది శూన్యమని ఆమె అన్నారు. ఈ యాబై ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ఆమె అన్నారు. ఈ తరంలోనైనా తన ప్రాంతం అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు అవసరమైన విజయం సాధించే వరకు తాను విశ్రమించబోనని ఆమె చెప్పారు. పోరాటం నాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు అని ఆమె అన్నారు.

రాజకీయ స్వార్థానికి ఉపయోగంచుకుంటున్న టిడిపివారికి మళ్లీ అవకాశం ఇస్తే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతామని ఆమె అన్నారు. విజయశాంతికి తెలంగాణ ముఖ్యమని ఆమె అన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణవాదినేనని ఆమె అన్నారు. ఏ జిల్లాలోనైనా, ఈ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా అని, ఇది చెప్పడానికి తనకు భయం లేదని, తాను తెలంగాణ బిడ్డను కాబట్టి ఆ భయం లేదని ఆమె అన్నారు. టిడిపి తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌పై కూడా ఆమె ధ్వజమెత్తారు. సాగునీరు, తాగు నీరు గురించి తెలుగుదేశం పార్టీవారు పట్టించుకున్నారా అని ఆమె అడిగారు. రైతులు బతకలేని స్థితిని కల్పించారని ఆమె అన్నారు. వ్యవసాయం చేయవద్దని చంద్రబాబు సలహా ఇచ్చారని ఆమె వ్యంగ్యంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విజయశాంతి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏకైక శత్రువని ఆమె అన్నారు.

నక్సలైట్‌ సమస్య చాలా పెద్ద సమస్య అని, దాన్ని ఎవరూ పరిష్కరించడం లేదని, తెలంగాణబిడ్డలే ఈ సమస్యలో చనిపోతారని, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని ఆమె అన్నారు. నక్సలైట్‌ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని, రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు చనిపోతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, చంద్రబాబుకు పబ్లిసిటీ మాత్రమే కావాలని ఆమె అన్నారు.

తాను తెలంగాణ అమ్మాయిని కాదని తెలుగుదేశం పార్టీ అంటోందని, తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఈ స్థాయికి రావడానికి తెలంగాణ పేద ప్రజలే కారణమని, తెలంగాణకు మేలు చేద్దామని తాను వచ్చానని ఆమె అన్నారు. చంద్రబాబు తనపై హేళన చేసి మాట్లాడించారని, ఇదేనా ఆడవాళ్లకు చంద్రబాబు ఇచ్చిన గౌరవమని విజయశాంతి అన్నారు. ఎన్టీ రామారావు 610 జీవో తెచ్చారని, చంద్రబాబు ఎన్టీ ఆర్‌ను వెన్నుపోటు పొడిచారని, 610ను చంద్రబాబు అమలు చేయలేదని, ఏ సమస్యను కూడా చంద్రబాబు పరిష్కరించలేదని ఆమె అన్నారు. డబ్బున్నవారికే చంద్రబాబు మేలు చేశారని ఆమె అన్నారు.

తెలంగాణ పెద్ద ఖజానా కాబట్టి రాజకీయ నాయకులు స్వార్థంతో దోచుకుంటున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు చెబుతున్న సమైక్యాంధ్రను ఎవరు కోరుతున్నారని ఆమె అడిగారు. ఎవరూ సమైక్యాంద్రను కోరుకోవడం లేదని ఆమె అన్నారు. వెనకబడిన ప్రాంతాలకు చంద్రబాబు న్యాయం చేయలేదని, తెలంగాణ ఉద్యమానికి ముందుకు వచ్చేవారిని తప్పుదోప పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. తాను బిజెపిలో తెలంగాణ కోసం పోరు చేస్తూనే ఉన్నానని, తెలంగాణ గురించి మాట్లాడనివ్వద్దని చంద్రబాబు చెబుతూ వచ్చారని, అయినా తాను మాట్లాడుతూనే ఉన్నానని ఆమె అన్నారు.

ప్లెబిసైట్‌ పెట్టండి

రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ వాదనను విజయశాంతి తీవ్రంగా తప్పు పట్టారు. కాంగ్రెస్‌ వారు భూమి పూజలు చేస్తున్నారని, చేస్తూనే ఉంటారని, మనం అలాగే ఉంటామని, ఏ విధమైన మేలూ జరగదని ఆమె అన్నారు. భార్యాభర్తల మాదిరిగా విడాకులు తీసుకోవచ్చునని అన్నారని, విడాకులకు యాభై ఏళ్లు పడుతుందా అని ఆమె అన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్‌ నానుస్తున్న తీరుపై ఆమె ఒక పిట్టకథ ద్వారా తీవ్ర విమర్శ చేశారు.

అన్ని పార్టీలు సరేననాలి కదా అని, రెండో ఎస్సార్సీ ఉంది కదా అని ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి అంటున్నారని, ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని, రెండో ఎస్సార్సీ అని ఎందుకు మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. ఓటింగ్‌ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ప్లెబిసైట్‌ ద్వారా తెలుసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాలయాపన అవసరం లేదని, మనం డిమాండ్‌ చేస్తున్నామని, ఒకే ఒక నెల సమయం ఇస్తున్నామని, ఏదో ఒకటి తేల్చి చెప్పానని ఆమె అన్నారు.

కెసి ఆర్‌, నరేంద్రలపై గౌరవం

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర్‌ రావు, నరేంద్రలపై తనకు గౌరవం ఉన్నదని, ఉద్యమం ఈ స్థాయికి రావడానికి వారే కారణమని ఆమె అన్నారు. చంద్రశేఖర్‌ రావు చివరి వరకు ఆ మాటను నిలబెట్టుకుంటారా అని విజయశాంతి అడిగారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నవాళ్లు నిజాయితీగా ఉండాలని, స్వార్థానికి గురి కాకూడదని ఆమె అన్నారు.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న విజయశాంతి బుధవారం ఉదయం న్యాయవాదులు, మేధావులు, విద్యార్థులు, తదితర వర్గాలకు చెందినవారితో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఎక్కడ జరిగిందనే విషయాన్ని సమావేశ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. మారుతి గార్డెన్స్‌కు ఆమె సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు.

వామపక్షాలు తప్పు చేస్తే నిలదీస్తా

వామపక్షాలపై తనకు గౌరవం ఉన్నదని, అయితే తప్పు చేస్తే నిలదీస్తానని ఆమె అన్నారు. అందరూ దొంగలేనని, వారిని మనం నమ్ముతున్నామని ఆమె అన్నారు. తెలంగాణ పట్ల వామపక్షాలకు బాధ్యత లేదా అని ఆమె అడిగారు. వామపక్షాలు ఒప్పుకోవడం లేదని కాంగ్రెస్‌ వారంటున్నారని, చంద్రబాబు లాగే వామపక్షాలు కూడా సమైక్యాంధ్ర అంటున్నారని ఆమె అన్నారు. సిపి ఐ, సిపియం మధ్య ఐక్యత లేదని, విభేదాలతో వారు విడిపోయారని, తెలంగాణవారు విడగొట్టండని అడుతుంటే సమైక్యంగా ఉండమనడం ఏం న్యాయమని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని ఆమె వామపక్షాలను కోరారు.

బిజెపీ తీరు ఇది

చంద్రబాబుతో పొత్తు వల్ల బిజెపి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోందని, తప్పులు చేస్తున్నారని, వీరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇది బిజెపిని తప్పు పట్టడం కాదని, ఇక్కడ కూడా చంద్రబాబునే తప్పు పట్టాలని ఆమె అన్నారు. బిజెపి చిన్న రాష్ట్రాలు ఇచ్చిందని, చంద్రబాబు వల్ల తెలంగాణ ఇవ్వలేకపోయిందని ఆమె అన్నారు.

విజయశాంతిని బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకులు కలిసినట్లు సమాచారం. వారు విజయశాంతితో ఏం మాట్లాడారనేది తెలియడం లేదు. సమావేశానంతరం ఆమె గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె శాసనసభకు ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి సభా స్థలికి చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద పెట్టున తెలంగాణ నినాదాలు వినిపించాయి.

విజయశాంతి ఉద్యమానికి తెలంగాణ ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ మద్దతు ప్రకటించారు. ఆయన సభలో ప్రసంగించారు. పియుసియల్‌యల్‌ నాయకురాలు జయ వింధ్యాల విజయశాంతి ఉద్యమానికి మద్దతు తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X