Explained: పెట్రో టార్గెట్ రూ. 125 +.. ?
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఈ రెండు వారాల వ్యవధిలో వీటి రేట్లు పెరగడం ఇది నాలుగోసారి. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలను దాటేసింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. లీటర్, డీజిల్ పై లీటర్ కు ఏకంగా రూ. 2.61 పైసలు, డీజిల్ పై రూ. 2.71 పైసల మేర పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
15 రోజుల్లో నాలుగుసార్లు..
ఈ నెలలో ఇంధన ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. మొదటిసారిగా ఈ నెల 15న వీటి రేట్లను పెంచింది కేంద్రం. ఆ తర్వాత మే 19న పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరగ్గా, రెండు రోజుల కిందటే అంటే 23న కూడా సుమారు 90 పైసల మేర సవరించింది.

రూ. 100 క్రాస్..
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12, డీజిల్ రూ. 95.20 పైసలకు చేరింది. ఇతర ప్రధాన నగరాలలో ధరలను పరిశీలిస్తే, కోల్‌కతాలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 113.51, డీజిల్ రూ. 99.82 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.107.77 కాగా ఉండగా, డీజిల్ రూ. 99.55 పైసలుగా నమోదైంది.
కనీసం రూ. 125..
ఈ పెంపుదలకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. కనీసం పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 125 రూపాయలకు పైగా చేరే అవకాశం ఉంది. అలాగే డీజిల్ కూడా. డీజిల్ లీటర్ కు రూ. 120కి పైగా చేరొచ్చు. దీనికి కారణాలు లేకపోలేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం భారత్ చమురు, గ్యాస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దెబ్బకొట్టిన పశ్చిమాసియా..
హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రవాణాకు అంతరాయం వల్ల ముడి చమురు సరఫరా 40 శాతం దెబ్బతిన్నది. సీఎన్జీ- 50, ఎల్ఎన్జీ- 50, ఎల్పీజీ దిగుమతులు ఏకంగా 90 శాతం దెబ్బతిన్నాయి. ధరలు నాలుగుసార్లు పెంచినా కూడా చమురు సంస్థల నష్టాలు తగ్గడం లేదు. పీపీఏసీ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 69.01 డాలర్లు ఉండగా ఇప్పుడది 109.31 డాలర్లకు చేరింది.
సగటు బ్యారెల్ ధరలో 60 శాతం పెరుగుదల..
ఫిబ్రవరితో పోలిస్తే సోమవారం నాటికి సగటు క్రూడ్ ధర బ్యారెల్‌కు 40.3 డాలర్లు అంటే 58.39 శాతం పెరిగింది. ఈ నెల మొదటి 24 రోజుల్లో క్రూడ్ ధర బ్యారెల్‌కు సగటున 107.96 డాలర్ల కంటే ఎక్కువే. 85 శాతానికి పైగా ముడి చమురు, 60 శాతం వరకు ఎల్పీజీ అవసరాల కోసం అంతర్జాతీయ మార్కెట్ పైనే ఆధారపడుతోంది భారత్. పైగా 40 శాతం ముడి చమురు, 90 శాతం ఎల్పీజీ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తాయి.
ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినా..
అమెరికా-ఇరాన్ వివాదం వల్ల హార్ముజ్ జలసంధిలో సరుకు రవాణా తీవ్ర అంతరాయం కలిగింది. దీనితో, ముడి చమురు దిగుమతులపై భారత్ వ్యయం సుమారు 60 శాతానికి పైగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై దిగుమతుల భారాన్ని తగ్గించడానికి కేంద్రప్రభుత్వం మార్చి 27న పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
రాష్ట్రాల్లో వ్యాట్..
అంతర్జాతీయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు సంస్థల నష్టాలను తగ్గించేందుకు ఈ పన్ను రాబడిని వదులుకోవాలని నిర్ణయించింది. ఈ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్/అమ్మకపు పన్నులను తగ్గించకపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు.












Click it and Unblock the Notifications