రాజకీయ ప్రక్షాళనకు యువతకు బాబు పిలుపు
హైదరాబాద్: రాజకీయ ప్రక్షాళనకు యువత ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. యువతపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై సోమవారం ఆయన మాట్లాడారు. యువతకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించి వారిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని మరిచిపోయిందని, డియస్‌సి నియామకాలు కూడా చేయలేదని ఆయన అన్నారు. రాజీవ్ యువశక్తి పథకంలో కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
సోమవారం మహానాడు ఆర్థిక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కాంగ్రెస్‌వారు సొంత జేబులు నింపుకోవడంతోనే సంబరపడుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ తీర్మానంపై మాట్లాడుతూ విమర్శించారు. గ్రామీణ ఉపాధి కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కాంగ్రెస్ ఏ రోజూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంస్కరణలను మానవీయ కోణంలో అమలు చేసి సామాన్యుడికి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
