తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతిలో తెలుగుదేశం, వైసిపి కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఒక్కసారిగా నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో కలిసి నామినేషన్ వేయడానికి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీతో వెళ్లారు.
తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
దీంతో అక్కడ పెద్ద ఎత్తున వైసిపి కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం దగ్గర చేరుకున్నారు. అయితే అంతకుముందే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ఇక వైసిపి టిడిపి కార్యకర్తలు ఇద్దరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై రాళ్లదాడి జరిగిందంటూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు.

పోలీసుల లాఠీఛార్జి
టిడిపి కార్యకర్తలు ప్రతి దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ, టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇరువర్గాలను చెరొక దిక్కు చెదరగొట్టి అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు వేసి వెళ్ళిపోయే వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరిని ఉండనీయకుండా చేశారు.
పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
ఇదిలా ఉంటే చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నట్టుగా సాగుతుంది. ఇక్కడ ఈసారి ఎన్నికలు ఉద్రిక్తంగానే ఉంటాయన్న అంచనా ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ అవకాశం కల్పించారు.
కొడుకు కోసం చెవిరెడ్డి రాజకీయం
ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఒంగోలు నుండి పోటీలో ఉన్నారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు ఒంగోలులో ఈగ ప్రచారం సాగిస్తూనే మరోవైపు కుమారుడు కోసం కూడా చంద్రగిరి రాజకీయాలను చక్కబెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆయన తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.
రాజకీయంగా కంటే వ్యక్తిగతంగా శత్రువులు
ఇదిలా ఉంటే మరోవైపు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలో పులివర్తి నాని వర్గీయులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. పులివర్తి నాని, పులివర్తి నాని భార్య కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పోరాటమే చేస్తున్నారు. ఇక రాజకీయంగా కంటే వ్యక్తిగతంగా శత్రువులుగా మారిన చెవిరెడ్డి, పులివర్తి ఇద్దరు ఎన్నికల పోరులో ఉండడంతో ముందు ముందు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయి అన్న అభిప్రాయం తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications