ఇక మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లను మీరే ఎన్నుకోవచ్చు- ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్..!
ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.
1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు.

ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్‌లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యక్ష ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు అవకాశం ఉంటుందన్నారు.














Click it and Unblock the Notifications