కూటమి సర్కార్ లో సూపర్ సీఎం ? ఏ మంత్రి నిర్ణయం అయినా వీటో చేసే అధికారం..!
కూటమి ప్రభుత్వం అంటేనే రెండు, మూడు పార్టీల భాగస్వామ్యం ఉంటుంది. అందులో వివిధ పార్టీలకు చెందిన మంత్రులు ఉంటారు. అయినా ప్రభుత్వం విధానం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మహారాష్ట్రలో (Maharashtra) అధికారంలో ఉన్న మహాయుతి కూటమి సర్కార్ లో మాత్రం అందుకు భిన్నంగా పరిస్ధితులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis).. కొత్తగా ఓ రూల్ తీసుకొచ్చారు. కేబినెట్లో ఏ మంత్రి నిర్ణయాన్ని అయినా తాను సమీక్షించి, రద్దు చేసే అధికారం తీసుకున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఏ మంత్రి తీసుకున్న నిర్ణయాలనైనా రద్దు చేసే అధికారాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కల్పించారు. అయితే ఆ చర్య ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలని భావించి, అందుకు గల కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలని ఓ షరతు పెట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం 'మహారాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ నియమావళి, 2026'ని ఖరారు చేసింది. మహారాష్ట్ర కూటమి సర్కార్ లో ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉండగా.. శివసేన, ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, సుమిత్రా పవార్ ఉన్నారు.

పైకి ఇది పరిపాలనా విధానాలపై స్పష్టత ఇచ్చే మార్పులా కనిపిస్తున్నా .. దీని వెనుక ఉన్న రాజకీయ ప్రభావం కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని భావించినట్లయితే, ఏ మంత్రి తీసుకున్న నిర్ణయాలలోనైనా జోక్యం చేసుకుని, వాటిని మార్చే స్పష్టమైన అధికారాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కట్టబెట్టారు. ఒక శాఖకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత ఆయా మంత్రిపైనే ఉన్నప్పటికీ, ముఖ్యమైన లేదా వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేయడానికి ముఖ్యమంత్రికి ఇప్పుడు స్పష్టమైన, నియమాధారిత అధికారం లభించింది. ఈ అధికారాన్ని వాడేటప్పుడు ముఖ్యమంత్రి తన నిర్ణయానికి గల కారణాలను రాతపూర్వకంగా నమోదు చేస్తే సరిపోతుంది. దీంతో కూటమిలో పార్టీల మధ్య సఖ్యత మరోసారి చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications