సమస్యలు పరిష్కారం: వైయస్‌తో కలిసి కెసిఆర్ ప్రకటన
న్యూఢిల్లీ: తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సహకార స్ఫూర్తితో వ్యవహరించారని ఆయన అన్నారు. మూడున్నర గంటల అనంతరం బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, టిఆర్‌యస్ నేత చంద్రశేఖర్ రావు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. తమ డిమాండ్ల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, ప్రయోజనాల దృష్ట్యా టి ఆర్‌యస్‌తో కలిసి తాము ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరం దృష్ట్యా చిన్నపాటి విభేదాలను పరిష్కరించుకుంటూ పోతామని ఆయన అన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, కలిసి సాగుతామని చంద్రశేఖర్ రావు అన్నారు. కాంగ్రెస్, టి ఆర్‌యస్‌ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం బలపడుతున్న కొద్దీ టి ఆర్‌యస్ తిరిగి రాష్ట్రంలో ప్రభుత్వంలో చేరే ప్రక్రియ చోటు చేసుకుంటుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు వేటికీ సమాధానం ఇవ్వకుండా ముగ్గురు నాయకులు తాము చెప్పదలుచుకున్న విషయాలను చెప్పి లేచి వెళ్లిపోయారు. తమ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని మీడియా ప్రతినిధులు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ వారు తిరస్కరించారు. నాలుగు పొడిపొడి మాటలు మాట్లాడేసి నాయకులు వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావుల మధ్య చర్చలు ముగిశాయి. ఇరువురు నాయకుల మధ్య ఢిల్లీలోని ఎపి భవన్‌లో బుధవారం దాదాపు మూడున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. ఆరు అంశాలపై ప్రధానంగా ఈ చర్చ జరిగింది. చర్చలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సంధానకర్తగా వ్యవహరించారు. చర్చల్లో ఆ ఇరువురు నాయకులతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, టిఆర్‌యస్ మరో అగ్రనేత ఎ. నరేంద్ర కూడా పాల్గొన్నారు. ఈ ఇరువురు నాయకులు సంయుక్త మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications