పనితీరు బాగుకే అదనపు శాఖలు: రోశయ్య
హైదరాబాద్: ప్రభుత్వ పనితీరును మెరుగపరచడానికే మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. ఇదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తాను అనుకుంటున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ విస్తరణ తర్వాత ఈ బాధ్యతలను మిగతావారికి సర్దుబాటు చేసే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. మంత్రివర్గం సైజును బట్టి పనితీరును అంచనా వేయలేమని ఆయన అన్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి వద్ద శాఖలు ఉన్నంత మాత్రాన పని జరగడం లేదనేది కూడా సత్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)మంత్రుల రాజీనామాతో ప్రస్తుత మంత్రలకు అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. టి ఆర్‌యస్ తిరిగి మంత్రివర్గంలో చేరుతుందో చేరదో తనకు తెలియదని, ఇది తన పరిధిలో విషయం కాదని ఆయన అన్నారు. టి ఆర్‌యస్, తాము కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని, టి ఆర్‌యస్ మంత్రివర్గంలో చేరిందని, అయితే కొన్ని విషయాలపై చిరుకోపంతో వారు రాజీనామా చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకున్న అభిప్రాయాలను అధిష్ఠానవర్గానికి టిఆర్‌యస్ చెప్పుకుందని, దాంతో అధిష్ఠానం చర్చలకు ఏర్పాటు చేసిందని, అపోహలు తొలగి కథ సుఖాంతమైందని ఆయన అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వ్యాధి సోకుతున్న విషయం వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా స్వీకరించిన ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వ్యాధి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సమీక్ష వివరాలను రోశయ్య మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. మలేరియా సోకిన మాట వాస్తవమే గానీ దాని వల్ల మరణాలు సంభవించలేదని ఆయన అన్నారు. మలేరియా వ్యాధి నిరోధానికి అదనపు సిబ్బందిని పంపుతున్నామని, మందులను పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications