తిరుపతి సర్వదర్శనం టోకెన్ కౌంటర్లల్లో టీటీడీ చేసిన తనిఖీల్లో.. !!
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో గల టోకెన్ల జారీ కౌంటర్లను ఆయన తనిఖీ చేశారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు.

రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తోన్నారని, అయినప్పటికీ వారి సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందురోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి సీజన్‌లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భక్తులు తిరుమలకు వస్తే, అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభమవుతుందని వివరించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు. పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నాయని, భక్తులు కూడా సహకరించాలని కోరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కేవీ మురళీకృష్ణ సూచించారు. టీటీడీ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై తమకు సమాచారం అందించాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసులు మరియు టిటిడి విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications