పులిచింతలను మారిస్తే ఉద్యమిస్తాం: టిడిపి
విజయవాడ: కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని మారిస్తే ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీటి విడుదల విషయంలో కృష్ణా డెల్టాకు అన్యాయం చేస్తే సహించమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌రావు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా డెల్టాకు నీరందించే విషయంలో కేంద్రమంత్రి కెసిఆర్ చేస్తున్న బాధ్యతారహితమైన ప్రకటనలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలు నదీజలాల విషయంలో మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే పట్టించుకోని వైయస్, కెసిఆర్‌లు కృష్ణా డెల్టాను, నాగార్జునసాగర్ ఆయకట్టును వేరుచేసి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటిపై పూర్తి హక్కు ఉందని ఆయన చెప్పారు. కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు రాకుండా వాటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కృష్ణా డెల్టాకు అన్యాయం జరిగితే సహించబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications