ప్రభుత్వంతో నక్సల్స్ చర్చలు అసాధ్యం: కళ్యాణ్
విజయవాడ: ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపే అవకాశం లేదని మావోయిస్టుల మాజీ ప్రతినిధి, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత జి. కళ్యాణ్ రావు అన్నారు. రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నేతలను మావోయిస్టులు డిమాండ్ చేయడం సబబేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వ రాజ్యహింసనే ఆ డిమాండ్‌కు కారణమని ఆయన అన్నారు. నక్సలైట్ల ఎజెండాపై టి ఆర్‌యస్ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ సాధనే ధ్యేయంగా చెప్పుకుందని, ఆ రెండు అంశాల్లో విఫలమైనప్పుడు టి ఆర్‌యస్ ప్రభుత్వం కొనసాగడం సరైంది కాదని ఆయన అన్నారు.
నక్సలైట్లతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పడం బూటకమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన హామీకి కలిగిందని, కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయిందని ఆయన అన్నారు. టి ఆర్‌యస్ నాయకులను రాజీనామాలు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారే గానీ వారిపై భౌతికదాడులకు, బెదిరింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎస్సార్సీల గురించి ఒక వైపు కాంగ్రెస్ మాట్లాడుతుంటే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు విప్పకపోతే తెలంగాణ కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందని ఎలా అనుకోగలమని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications