భారీ వర్షాలు: ముంచెత్తుతున్న వాగులు, వంకలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం వల్ల గత రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొండచరియలున్న ప్రాంతాల్లోనే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జలదిగ్బింధనంలో చిక్కుకుంది. రాళ్లవాగు పొంగిపొర్లుతుండడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మంచిర్యాలలోని ఏడు కాలనీలు మునిగిపోయాయి. మందమర్రి సమీపంలోని పాలవాగు పొంగిపొర్లుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమవుతున్నాయి. హైదరాబాద్ శివారులోని మల్కాజిగిరి బండ్లగూడ చెరువుకు గండిపడింది. అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముగ్గురు అధికారలతో ఒక కమిటీ వేశారు. డ్రైనేజీవ్యవస్థపై ఆయన ఆదివారం సమీక్ష జరిపారు.
వరంగల్ జిల్లాలో వరదతాకిడి తీవ్రంగా ఉంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోరంచవాగు పొంగిపొర్లుతోంది. మోరంచవాగు ప్రాజెక్టు పనులు చేస్తున్న 15 మంది కూలీలు వరదల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వరంగల్ జిల్లా మంగపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం తదితర మండలాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల రహదారి నీట మునిగింది. దీంతో బస్సులు రద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా మంథని, మహదేవ్‌పూర్ తదితర మండలాల్లోని మానేరు, తదితర వాగులు పొంగిపొర్లుతున్నాయి.
బసవాపురం వద్ద ఆంధ్రకు, కర్ణాటకకు నీరందించే తుంగభద్ర లోలెవెల్ కెనాలుకు, బళ్లారి వద్ద హైలెవల్ కెనాల్‌కు గండ్లు పడ్డాయి. గండ్లు పూడ్చడానికి అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications