పిఆర్‌సిపై ఆందోళన సరికాదు: వైయస్
కడప: వేతన సవరణ సంఘం (పి ఆర్‌సి)పై ఉద్యోగ సంఘాల డిమాండ్ సరైంది కాదని, వారు ఆందోళన చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో రాజీవ్‌నగర బాటలో పొల్గొనడానికి బుధవారం ఇక్కడికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు డి. ఎ. పెంచామని, దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా 600 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆయన అన్నారు. ద్రవ్యలోటును తగ్గించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని, ఈ విషయాన్ని ఉద్యోగులు ఆలోచించాలని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో ద్రవ్యలోటును పూర్తిగా తగ్గిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదాయమార్గాలను కూడా ఉద్యోగులు సూచించాలని ఆయన అన్నారు.
విశాఖ ఏజెన్సీలో విషజ్వరాల వల్ల మరణించింది ఏడుగురేనని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మన్యం మరణాల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. మన్యంమరణాల విషయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ చెప్పిందే నిజమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
