డబ్బులో గెలవాలని కాంగ్రెస్ కుయుక్తులు: బాబు
హైదరాబాద్: డబ్బులిచ్చి మున్పిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. దయనీయమైన స్థితికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆయన బుధవారంనాడు గుంటూరు జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ అదే డబ్బులు పంచి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం సాగుతోందని, దీంతో కాంగ్రెస్‌కు ఓటేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగులను కూడా మోసం చేసిందని ఆయన అన్నారు. మైనారిటీలకు రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications