వరద బాధితులకు పక్కా ఇళ్లు: వైయస్
భద్రాచలం: వరదల వల్ల ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో ఆయన బుధవారం ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలంలో పునరావాస శిబిరంలోని బాధితులను పరామర్శించారు. రామాలయం వద్ద ముంపునకు గురైన 80 కుటుంబాలవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వరద తాకిడి ప్రాంతాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తామని, సబ్సిడీపై విత్తనాలను అందజేస్తామని ఆయన చెప్పారు. తక్షణ సాయం కింద ఇంటికి 5 వేల రూపాయలేసి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వరద తాకిడి ప్రాంతాల్లో వైద్య సహాయానికి ఇద్దరు అదనపు డైరెక్టర్ల పర్యవేక్షణలో వైద్య బృందాలను నియోగించినట్లు ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రమాదం పూర్తిగా తొలగిపోనందున అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరదల వల్ల గండ్లు పడిన రోడ్లకు, చెరువులకు యుద్ధప్రాతిపదికపై మరమ్మత్తులు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications