బెజవాడ ఎన్నికల వాయిదాకు ఇసి పరిశీలన
హైదరాబాద్: విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. భారీ వరదలతో తల్లడిల్లుతున్న విజయవాడలో ఎన్నికలను వాయిదా వేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడలోని కొన్ని కాలనీల్లో ఇప్పటికీ నీరు నిలిచే ఉంది. ఈ నీరు తొలగిపోతే తప్ప పోలింగ్ జరపడానికి వీలు కాదని ఎ.వి.యస్. రెడ్డి అంటున్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గితేనే విజయవాడలోని కాలనీల్లో నిలిచిపోయిన నీరు తొలగిపోతుందని, ఆ నీరు తొలగిపోతే ఎల్లుండి పోలింగ్ జరపడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. అయితే విజయవాడలోని భవానీపురం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన నీరు తొలగిపోయే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణాలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీని వల్ల పోలింగ్ జరిపేందుకు అనువైన వాతావరణం ఏర్పడకపోవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications