పాకిస్థాన్..? భారత్..? ఏది ముఖ్యం..? : తేల్చేసిన అమెరికా
అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్, పాకిస్థాన్ తో అమెరికాకు ఉన్న దౌత్య పరమైన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలో భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు పాకిస్థాన్ తో ఉన్న సంబంధాలు.. వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్ తో ఉన్న బంధాన్ని ఎలాంటి దెబ్బ తీయదని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ దేశంతోనైనా అమెరికాకు ఉన్న సంబంధాలు, భారత్ తో ఉన్న తమ వ్యూహాత్మక బంధానికి నష్టం కలిగించేలా ఉండవని మార్కో రూబియో స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్ తో మరింతగా సన్నిహితంగా ఉండటంతో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆందోళనలను మార్కో రూబియో తోసిపుచ్చారు. బాధ్యతాయుతమైన దేశాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో ప్రాథమిక లేదా తాత్కాలిక అవసరాల కోసం సంబంధాలను కలిగి ఉంటాయని.. భారత్ కూడా అదే విధానాన్ని ఆవలంబిస్తోందని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ తో ఉన్నవి కేవలం టాక్టికల్ స్థాయి సంబంధాలేనని.. కానీ భారత్ తో అమెరికాకు ఉన్న బంధం వ్యూహాత్మకమైనదని అని పేర్కొన్నారు.
ఇక రాబోయే రోజుల్లో భారత్- అమెరికా మధ్య వాణిజ్యం మరింత దృఢంగా మారుతుందని మార్కో రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సుంకాలు, ఇతర అంశాల వల్ల బంధంలో వేగం తగ్గిందనే వాదనలను రూబియో తిరస్కరించారు. అలాగే అమెరికా విధించిన సుంకాలు కేవలం భారత్ ను లక్ష్యంగా చేసుకుని చేసినవి కాదని.. గ్లోబల్ ట్రేడ్ కోసం ట్రంప్ తీసుకున్న అంతర్జాతీయ నిర్ణయం అని ఆయన వివరించారు. భారత్, అమెరికా త్వరలోనే ఓ దీర్ఘకాలిక అలాగే ఇరు దేశాలకు ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. త్వరలోనే అమెరికా బృందం భారత్ కు రాబోతోందని ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఒప్పందంలోని పలు అంశాలపై భారత్ అభ్యంతరం చెబుతుందని తెలిపారు. 140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని జై శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి నిర్వహించిన సంయక్త మీడియా సమావేశంలో జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications