బీహార్ అసెంబ్లీ రద్దు రాజ్యాంగవిరుద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన గవర్నర్ బూటా సింగ్ నివేదిక ఆధారంగా బీహార్ శాసనసభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. జస్టిస్ వై.కె. సబర్వాల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. పూర్తి స్థాయి తీర్పును ఈ నెలాఖరులోగా వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. బీహార్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ స్థితిలో శాసనసభను పునరుద్ధరించాలని ఆదేశించడం సాధ్యం కాదని తెలియజేసింది. ఇప్పటికే ప్రారంభమైనందున ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు తెలియజేసింది.
గవర్నర్ బూటాసింగ్ నివేదిక ఆధారంగా గత 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం బీహార్ శాసనసభను రద్దు చేసింది. బీహార్ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ నలుగురు శాసనసభ్యులు రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా (బిజెపి), కిశోర్ కుమార్ మున్నా (ఇండిపెండెంట్), రామ్‌ప్రవేశ్ రాయ్ (జెడియు), డాక్టర్ అనిల్‌కుమార్ (యల్‌జెపి తిరుగుబాటుదారు) సుప్రీంకోర్టుకు ఎక్కారు. ఇదే సమయంలో ఇండిపెండెంట్ ఎమ్యెల్యే పూర్ణిమా యాదవ్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. విప్లవ్ శర్మ అనే న్యాయవాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
బీహార్ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకంపనలు సృష్టించింది. బూటాసింగ్ బీహార్‌లో ఉండడానికి అనర్హుడని భారతీయ జనతాపార్టీ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై యన్‌డిఎ పక్షాలు రాష్ట్రపతిని కలవనున్నాయి. పూర్తి తీర్పు వెలువడిన తర్వాతనే ప్రతిస్పందిస్తామని కాంగ్రెస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు నేపథ్యంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని జెడియు నేత నితీష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications