ఆర్టీసి సమ్మెపై ఎస్మా ప్రయోగం: కన్నా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) కార్మికుల సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగించనున్నట్లు రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. ప్రైవేట్ వాహనాలపై, లారీలపై ఉన్న ఆంక్షలను సడలించనున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆర్టీసి కార్మికుల సమ్మె కాలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమ్మె కాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేసింది. మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమస్యలపై ఆర్టీసి కార్మికులు ఇక యాజమాన్యంతోనే చర్చలు జరపాలని కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించబోమని ఆర్టీసి చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. కార్మికులు, ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. వేతనాలపై ఒక ఏడాది ఓపిక పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మెను విజయవంతం చేసి తీరుతామని ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇక ఆర్టీసి కార్మికుల సంఘాల నాయకులతో చర్చలుండవని కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. మధ్యంతర భృతి కోసం పట్టుబడుతున్న కార్మిక సంఘాలకు ఆర్టీసి మనుగడపై చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
