పేలుడులో హోంగార్డు మృతి: లోపాలపై ఆరా
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంపేటలో గల టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బాంబు పేలుడు సంఘటన విషయంలో ఇంటలిజెన్స్ వైఫల్యం కూడా ఆరా తీస్తున్నామని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై బుధవారం బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు సంఘటనలో హోంగార్డు సత్యనారాయణ మరణించాడు. శిథిలాల కింద గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైంది. హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి చెప్పారు. ఆయన గురువారంనాడు టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించి బాంబు పేలుడు సంఘటన గురించి పరిశీలన జరిపారు.
పేలుడు సంఘటనపై క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ సంఘటనలో ఐయస్‌ఐ పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరణించిన యువకుడు ఐయస్‌ఐకి సంబంధించినవాడు కావచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటనలో భద్రతా వైఫల్యాలపై అంచనా వేస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు భద్రతను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
