పోలవరంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశాయి. పోలవరంపై ప్రభుత్వం రెండోసారి గురువారంనాడు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. నిర్వాసితుల పునరావాసంపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు, సిపియం నాయకుడు తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారితో ఇతర ప్రతిపక్షాల నాయకులు గొంతు కలిపారు.
పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు మధ్య పోలిక ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతినిధి విద్యాసాగర్ రావు అన్నారు. పోలవరానికి, పోతిరెడ్డిపాడుకు లింక్ పెట్టవద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఇచ్చంపల్లి పూర్తి కాకుండా పోలవరం ప్రాజెక్టును చేపట్టడం సరి కాదని తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. పోలవరంపై ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన వివరాలు, ఇప్పుడు ఇచ్చిన వివరాలకు మధ్య పొంతన లేదని ఆయన విమర్శించారు. కేంద్ర జల సంఘానికి, అసెంబ్లీకి, అఖిల పక్ష సమావేశానికి ప్రభుత్వం పోలవరంపై వేర్వేరు వివరాలు ఇచ్చిందని ఆయన అన్నారు.
దాదాపు 3 గంటల పాటు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రతిపక్షాల నాయకుల వాదనలు విన్నారు. హంద్రీనీవా రెండో దశ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కె.సి. కెనాల్ ఆధునీకీకరణ పనులు కూడా చేపడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
