వర్గీకరణపై మంత్రుల మధ్య విభేదాలు
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ( ఎసి) రిజర్వేషన్ల వర్గీకరణపై ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావుపై మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎస్‌సిలను విడదీసే పద్ధతి మంచిది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాలలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, కోనేరు రంగరావు మాదిగలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందువల్ల రెండు పక్షాలు కలిసిపోయేలా వ్యవహరించి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఒడిదొడుకులు లేకుండా సాగడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రిజర్వేషన్ల వర్గీకరణ అమలు సాధ్యం కాదని గొల్లపల్లి సూర్యారావు అన్నారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలతో, పార్లమెంటుతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఎస్‌సిల వర్గీకరణను గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వర్గీకరణను సమర్థిస్తున్న కోనేరు ఆయన నిప్పులు చెరిగారు.
ఇదిలా వుంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యం ఆర్‌పియస్) నాయకుడు మంద కృష్ణ మాదిగ పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావుతో సమావేశమయ్యారు. ఎస్‌సి వర్గీకరణకు పూనుకోకపోతే కాంగ్రెస్ ప్లీనరీని అడ్డుకుంటామని మంద కృష్ణ మాదిగ హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ విషయంపై తమ నేత సోనియా గాంధీతో మాట్లాడతానని కేశవరావు మందకృష్ణ మాదిగకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
