తెలంగాణ ఇవ్వడానికే కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికే తాము కట్టుబడి ఉన్నామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, తెలంగాణ తమ ఎజెండాలోనే ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావుతో ఆయన నివాసంలో దిగ్విజయ్ సింగ్ సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ పాట పాడడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా ఉందని, తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీ మే నెలలో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. బ్రహ్మదేవుడు అడ్డు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆపలేరని దిగ్విజయ్ సింగ్ భేటీతో అర్థమైందని కెసిఆర్ అన్నారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమది ప్రజా ఉద్యమమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications