పంచాయతీ పోలింగ్: ఘర్షణలు, బాంబులు
ప్రకాశం, గుంటూరు, కడప, చిత్తూరు వంటి కొన్ని జిల్లాల్లో ఘర్షణలు, పోలింగ్ అక్రమాలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా భువనగిరి, నల్లగొండ డివిజన్లలో అవాంఛనీయమైన సంఘటనలేవీ చోటు చేసుకోలేదు. కృష్ణా జిల్లా శివాపురం గ్రామంలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ చెలరేగడంతో పది మంది గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇందులో ఐదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని నల్లపాడులో కాంగ్రెస్‌కు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలింగ్ నిలిచిపోయింది.
కృష్ణా జిల్లా దబ్బాకపల్లిలో చర్చిలో పోలింగ్ బూత్ పెట్టి రెండు గంటల పాటు ఓపెన్ బ్యాలెట్ నిర్వహించారు. దీనికి సిపియం, లోక్‌సత్తాలు అభ్యంతరం తెలియజేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రకాశం జిల్లా బొట్లవారిపాలెంలో బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోశారు. ఇదే జిల్లా వేమల గ్రామంలో పోలింగ్ బూత్‌పై 20 బాంబులు వేశారు. ప్రకాశం జిల్లా గొప్పూరివారిపాలెంలో పోలీసులు 30 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హేమాజిపురంలో దొంగ ఓట్ల విషయంలో ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా స్వర్ణపురంలో గుర్తులు తారుమారమయ్యాయి. దీంతో రెండు వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా పెద్దశెట్టిపాలెంలో ఘర్షణ చెలరేగి ముగ్గురు గాయపడ్డారు.
కడప జిల్లా పిట్టగుంటలో కూడా ఘర్షణ చెలరేగింది. ఇదే జిల్లా కమలాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా మల్లారం గ్రామంలో సిపిఐ, సిపియం వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సిపిఐ మహిళా కార్యకర్తపై సిపియం వర్గీయులు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యర్థులు రాస్తారోకోకు దిగారు.












Click it and Unblock the Notifications