పని చేయించడానికే ఆ జీవో: వైయస్ వివరణ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను (పియస్‌యులను) సమర్థంగా పని చేయించడానికే ఐదో నెంబర్ జీవోను జారీ చేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదో నెంబర్ జీవోపై పెద్ద యెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. జీవో అంతా చదవకుండా కొన్ని అంశాలను పట్టుకుని ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 68 వేల మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇవ్వడానికి 12,840 కోట్ల రూపాయలు అవసరమని, ఆ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇస్తారా, సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు ఇస్తారా అని ఆయన అడిగారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఉద్యోగుల కోసం తాము కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించామని, పూర్తిగా మూతపడిన ఒక కంపెనీ ఉద్యోగులను వి ఆర్‌యస్ కింద పంపడానికి కూడా అది సరిపోదని ఆయన అన్నారు.
ప్రజలకు హాని చేసే చర్యలను ప్రపంచబ్యాంకు చెప్పినా, మరెవరు చెప్పినా తాము వినబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచబ్యాంకుకు ఇష్టమున్నా లేకపోయినా తాము రైతులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలకు మేలు చేసే సలహాలు ఎవరు ఇచ్చినా వింటామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తూనే 65 వేల ఉద్యోగాలిచ్చామని ఆయన చెప్పారు. కష్టపడి సంస్థలను సమర్థంగా నడిపించడానికి మాత్రమే జీవో జారీ చేశామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్టీసి లాభాల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు. తాము సంస్కరణలకు వ్యతిరేకం కాదని, అయితే వాటిని మానవీయ కోణంతో అమలు చేస్తామని ఆయన చెప్పారు. చైనాలో కూడా ఇప్పుడు సంస్కరణలు అమలవుతున్నాయని, ఇప్పుడు చైనాలో మావో పేరు ఎత్తడానికే సిగ్గుపడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications