కెజిహెచ్ వైద్యుల ఆందోళన: ఇద్దరు రోగుల మృతి
విశాఖపట్నం: వైద్యాధికారిపై దాడికి నిరసనగా విశాఖపట్నంలోని కెజిహెచ్ వైద్యులు సోమవారం విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. దీంతో వైద్య సేవలు అందక ఒక పసికందు, మరో వృద్ధురాలు మృతి చెందారు. వైద్యం అందకనే వారు మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారిపై దాడి చేసినవారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదానికి గురై ఆస్పత్రికి వచ్చిన శ్రీను అనే రోగికి లంచం ఇవ్వకపోవడంతో వైద్యం చేయలేదని ఆరోపిస్తూ శ్రీను బంధువులు వైద్యాధికారిపై ఆదివారంనాడు దాడి చేశారు. ఆస్పత్రి ఆవరణలోని కుర్చీలను, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడికి నిరసనగా కెజిహెచ్ వైద్యులు సోమవారంనాడు విధులు బహిష్కరించారు. వైద్యులకు నచ్చజెప్పి అత్యవసర సర్వీసులను ప్రారంభింపజేయడానికి విశాఖపట్నం పోలీసు కమీషనర్ కౌముది ప్రయత్నాలు చేస్తున్నారు. దాడి చేసినవారిపై కేసులు నమోదు అయ్యేలా చూస్తానని శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా హామీ ఇచ్చారు. అయినా వైద్యులు వినిపించుకోలేదు.












Click it and Unblock the Notifications