తెలంగాణపై చొరవ చూపినందుకే కెకెపై వేటు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ బిడ్డ కాబట్టి, తెలంగాణవాదాన్ని అధిష్ఠానవర్గం వద్దకు తీసుకుని పోతున్నాడు కాబట్టి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి కేశవరావు చేత రాజీనామా చేయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తారని, పార్టీ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయరని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలంగాణలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన నిధులను తెలంగాణలోనే ఖర్చు చేయాలని కోరడానికి ఒక ప్రతినిధి బృందాన్ని పార్టీ అధిష్ఠానవర్గం వద్దకు తీసుకెళ్లడానికి కేశవరావు సిద్ధపడ్డారని, తెలంగాణ అంశంపై టిఆర్సీసిసి సమావేశంలో గట్టిగా మాట్లాడారని, అందుకే కుట్ర చేసి కేశవరావు చేత రాజీనామా చేయిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు చెప్పి రాజీనామా చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.
అయితే కేశవరావు ఇంటిలో జరిగిన ప్రశాంత్ రెడ్డి మృతి కేసు విచారణ జరగాల్సిందేనని, దోషులను శిక్షించాల్సిందేనని, అయితే సంఘటనను సాకుగా తీసుకుని కేశవరావు చేత రాజీనామా చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఫ్లై ఓవర్ కూలిపోవడంపై ప్రతిస్పందిస్తూ వైయస్ ప్రభుత్వ అవినీతికి అది అద్దం పడుతుందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తనవారికో నీతిని, ఇతరులకో నీతిని అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఫ్రాక్షనిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తన తమ్ముడు వివేకానందరెడ్డి ఇంటిని కదిలించని రాజశేఖర రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ఆఘమేఘాల మీద కదిలారని ఆయన అన్నారు. రామోజీ వద్ద ఒకవేళ అసైన్డ్ భూములుంటే స్వాధీనం చేసుకోవాల్సిందేనని, కానీ తమవారికో నీతిని, తనను వ్యతిరేకించేవారికో నీతిని అమలు చేయకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications