విచారణపై ప్రభావం చూపకూడదనే రాజీనామా: కెకె
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని కె. కేశవరావు చెప్పారు. ప్రశాంత్ రెడ్డిని తన కొడుకు వెంకట్ హత్య చేశాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన సోమవారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయం చెప్పారు. విచారణ స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. తానింకా రాజీనామా లేఖను పంపలేదని ఆయన చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లి ఈ సాయంత్రం 6 గంటల తర్వాత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని ఆయన చెప్పారు. దిగ్విజయ్ సింగ్ తో తాను మాట్లాడానని, రాజీనామా అవసరం లేదని చెప్పారని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డి మృతి సంఘటన పూర్తిగా వ్యక్తిగతమైందని ఆయన అన్నారు.
తన మనోగతాన్ని వివరించడానికి తాను ఈ ఉదయం సోనియా గాంధీతో మాట్లాడడానికి ప్రయత్నించానని, అయితే సోనియా కాశ్మీరుకు వెళ్లే తొందరలో ఉన్నారని, ఆ సమయంలో సోనియాతో ఉన్న కేంద్ర మంత్రి రేణుకాచౌదరితో తన మనసులోని మాట చెప్పానని ఆయన వివరించారు. రాజీనామా చేయకూడదని ఢిల్లీ నుంచి హైదరాబాదు వరకు అందరూ అంటున్నట్లు ఆయన తెలిపారు. విచారణపై అనవసరమైన ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో, అనవసర విమర్శలు ఎదురు కాకూడదనే తలంపుతో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సంఘటనకు సంబంధించి సత్యం వెలుగు చూస్తుందనే నమ్మకం తనకు ఉందని, విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందనే అభిప్రాయం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications