స్వదేశానికి వేలాదిగా ప్రవాసులు
స్వదేశంలో కూడా జీత భత్యాలు గణనీయంగా ఉండడంతో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో మాతృభూమికి చేరుకుంటున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 60 వేల మంది ఐటీ నిపుణులు అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినట్టు అమెరికాలో స్ధిరపడిన భారతీయ ఐటీ నిపుణుల సంఘం ఇండస్ ఆంత్రపెనార్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రిక్రూట్ మెంట్ పోర్టల్ క్లిక్ జాబ్స్ డాట్ కాం బిజినెస్ హెడ్ మైఖేల్ ఎం బాల కూడా ఈ విషయం చెప్పారు.
27-35 వయోవర్గంలోని దంపతులు స్వదేశానికి తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారని బాల చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి తమ పిల్లలను కాపాడి స్వదేశంలో చదువు చెప్పించాలని చాలా మంది తలిదండ్రులు ఉవ్విళ్ళూరుతున్నట్టు ఆయన వివరించారు.
భారతదేశంలో బహుళజాతి కంపెనీలు దాదాపు అమెరికా అంతటి జీతాలు ఇవ్వడం, ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం ఈ ధోరణికి కారణమని బాల తెలిపారు. ఈయన ఇటీవలే న్యూజెర్సీలో జాబ్ ఫెయిర్ నిర్వహించారు. భారతదేశంలో బహుళజాతి కంపెనీల కోసం రిక్రూట్ మెంట్లు చేయడమే ఈ జాబ్ ఫెయిర్ ఉద్దేశం. చాలా మంది ప్రవాస భారతీయులు స్వదేశంలోని బహుళజాతి కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపారని బాల చెప్పారు.
ఇటీవల న్యూజెర్సీలో జరిగిన జాబ్ ఫెయిర్ లో ఇండియాలో యాహూ, కానన్, ఐబిఎం, హెచ్ పి వంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసేందుకు మూడు వేల మంది ముందుకు వచ్చారు. ఇందులో దంపతులే ఎక్కువని బాల చెప్పారు. ఈ ప్రోత్సాహంతో మరో ఆరు నెలల్లోపు ఇంకో జాబ్ ఫెయిర్ ను అమెరికాలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
