తెలంగాణ రాష్ట్రం రాదా?
హైదరాబాద్: మేఘాల తీరుతెన్నులను బట్టి వర్షం పడుతుందో లేదో చెప్పగలం. అలాగే ఒక రాజకీయ పరిణామాన్ని బట్టి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేయవచ్చు. 2009 లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో లేదో కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే 2009 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదనుకోవచ్చు.
ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వారు కాబట్టి, కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారన్నది జగద్వితం. గతంలో కోస్తాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ వంటి కాపు నాయకుల పేర్లు ఈ పదవికి విన్పించినా తెలంగాణ నాయకుడు కేశవరావుకే పదవి దక్కింది. ఆ సమయంలో తెలంగాణ వాణిని బిగ్గరగా విన్పిస్తున్న కేశవరావు నోటికి తాళం వేయడానికే సమైక్య రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నియమించారు.
గతంలో లాగా కోస్తా నాయకుల పేర్లు పిసిసి అధ్యక్ష పదవికి విన్పించకపోవడం ఈసారి విశేషం. తెలంగాణకే ఈ పదవి ఖచ్చితంగా లభించనుందని తెలియడంతో వి.హనుమంతరావు, మల్లు రవి, నంది ఎల్లయ్య ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్న షబ్బీర్ అలీ కడుపు మీద తడి గుడ్డ వేసుకుని నింపాదిగా ఉన్నారు.
పిసిసి అధ్యక్షుడంటే ఒక ప్రాంతానికి పరిమితం కాదని, ఆయన సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ సెలవిచ్చారు. రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ అని కొన్ని రోజుల క్రితం తెగేసి చెప్పిన దిగ్విజయ్ సింగ్ పిసిసి అధ్యక్షుడి విషయంలో కూడా తెలంగాణ ఆశలను నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణపై వైఎస్ ఏం చెబితే దిగ్విజయ్ అదే వల్లిస్తున్నారు.
వైఎస్ ఆకాంక్షలకు అనుగుణంగా షబ్బీర్ అలీని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణ రాష్ట్రం ప్రస్తావన రాకుండా అడ్డుకోవచ్చని వైఎస్ భావిస్తున్నారు. ముస్లిం నాయకుడిని పిసిసి అధ్యక్షుడు వంటి కీలక పదవిలో నియమించడం ద్వారా పార్టీ లాభపడుతుందని వైఎస్ తన వాదనను విన్పించనున్నారు. షబ్బీర్ అలీ తెలంగాణ వాది కాదు, ముమ్మాటికి వైఎస్ వాది.
టీఅర్ ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణలో ఘన విజయం సాధించగలమన్న విశ్వాసం వైఎస్ కు ఉంది. తన హయాంలోనే టీఅర్ సిసిని తీవ్రంగా నష్టపరచాలన్నది కూడా వైఎస్ ఎజెండాలో ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వారికే కాంగ్రెస్ టికెట్లు వస్తాయని, గతంలో అలా జరగలేదని వైఎస్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
