వివాదాస్పద రామసేతు అఫిడవిట్‌ల ఉపసంహరణ
న్యూఢిల్లీ: రాముడు, రామాయణం ఉనికికి చారిత్రాకాధారాలు లేవంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) దాఖలు చేసిన అఫిడవిట్‌తో సహా సుప్రీంకోర్టులో రామసేతుపై ఇంతకుముందు దాఖలు చేసిన రెండు అఫిడవిట్‌లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది.రాముడు, రామాయణంలోని పాత్రలు ఉన్నాయనడానికి వాల్మీకి రాసిన రామాయణం, తులసీదాస్ రాసిన రామచరితమానస్‌లు ఆధారాలు కాబోవని ఏఎస్ఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేకాకుండా హిందువులు వానరుల సాయంతో రాముడు కట్టించాడనే రామసేతు వంతెన మానవ నిర్మితమని చెప్పడానికి చారిత్రక ఆధారాలేవీ లేవని ఏఎస్ఐ చెప్పింది. ఈ అఫిడవిట్‌పై అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చక్కదిద్దుకునే చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లను ఉపసహరించుకోవాలని నిర్ణయించుకుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అఫిడవిట్‌లను ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. ఆగస్టు 31వ తేదీన వివాదాస్పద సేతుసముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించవచ్చని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. కోర్టు ఇంతకుముందు రామసేతు వద్ద సేతుసముద్రం ప్రాజెక్టు పనులు చేపట్టవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంపై పూర్తి అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది.












Click it and Unblock the Notifications
