వరికి మద్దతు ధర కోసం ఢిల్లీకీ 2న వైయస్
హైదరాబాద్: వరికి మద్దతు ధర కల్పించాలని కోరడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్ ను, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కలిసి వరికి మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. స్వామినాధన్ కమిటి సిఫార్సుల మేరకు వరికి మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లిడించారు.
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 5 శాతం కరువు భత్యాన్ని (డిఎను) పెంచుతూ కూడా రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో కంచి పీఠం - స్విమ్స్ వైద్య కళాశాల నిమిత్తం 60 ఎకరాలు భూమిని కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే నెల్లూరు జిల్లాలో అపెరల్ పార్కు స్థాపనకు శ్రీలంక కంపెనీకి 750 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications