బాబ్లీపై మరోసారి ఉద్యమం: చంద్రబాబు
కరీంనగర్: గోదావరినదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మరోసారి ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఆయన సోమవారంనాడు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరి రైతుల ప్రయోజనం కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని కార్యాలయం పంచాయతీ అఫీసుకన్నా అధ్వాన్నంగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
వరికి మద్దతు ధర కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్ష బృందాన్ని తీసికెళ్లాలని చేస్తున్న డిమాండును ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. వరి మద్దతు ధర పెంచితే బియ్యం ధర పెరుగుతుందని ప్రధాని అనడాన్ని ఆయన ఖండించారు. గత మూడేళ్లలో ఏ పంటకూ మద్దతు ధర పెంచకపోయినా నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పెరిగాయని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications