AIADMK లో చీలిక, విజయ్ మద్దతుగా ఆ ఎమ్మెల్యేలు - కీలక మలుపు..!?
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని రాజకీయం చోటు చేసుకుంటోంది. విజయ్ కు వీసీకే మద్దతు తో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్న వేళ అన్నా డీఎంకేలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం పళిని స్వామికి సొంత ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కీలక భేటీకి ఆ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. వారంతా విజయ్ వైపు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. తాజా పరిణామాలతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సస్పెన్స్ వేళ..రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది.
తమిళనాడులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అన్నా డీఎంకే లో చీలక కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత అన్నా డీఎంకేలో ఒక వర్గం విజయ్ కు మద్దతు ఇచ్చేలా పళిని స్వామి పైన ఒత్తిడి తెస్తోంది. దీంతో.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు పుదుచ్చేరిలోని రిసార్ట్స్ లో ఉంచారు. ఈ రోజు వారిని చెన్నైకు తీసుకువచ్చారు. వారితో భేటీ కోసం పళిని స్వామి తన నివాసంలో కీలక భేటీ ఏర్పాటు చేసారు.

ఈ సమావేశానికి విజయ్ కు మద్దతుగా నిలుస్తున్న వారిలో ఆరుగురు డుమ్మా కొట్టారు. సీనియర్ నేత ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో ఆ ఆరుగురు మరో చోట భేటీ అయ్యారు. వీరిలో విజయ్ కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఆదవ్ అర్జున్ అత్త లీమా రోజ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం నెంబర్ గేమ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న విజయ్ కు ఈ చీలక భవిష్యత్ లో మేలు చేసే అంశంగా భావిస్తున్నారు.
ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ 108 సీట్లకే పరిమితం కావటం.. ప్రభుత్వం ఏర్పాటుకు 118 స్థానాలు కావాల్సి ఉండటంతో... ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో వారంతా పళిని స్వామి నిర్ణయాల ను విభేదిస్తున్నారు. దీంతో.. వారిని ఉంచిన రిసార్ట్స్ వద్దకు వెళ్లిన పళని స్వామి ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడారు. వారిని ఈ రోజె చెన్నైలోని మరో రిసార్టుకు తరలించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని అంశాలు చర్చిద్దామని పళిని స్వామి ఆహ్వానించారు.
కాగా.. ఆ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆ ఆరుగురు విజయ్ సన్నిహిత నేత అదవ్ అర్జున్ తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో వీరు విజయ్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. ముందుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేస్తే.. తరువాత రాజకీయం పై ఫోకస్ చేయాలని విజయ్ భావిస్తున్నారు. దీంతో.. విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఈ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications