అలిగి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్
హైదరాబాద్: అనూహ్యమైన రీతిలో శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభ్యుల తీరుపై అలిగి సభ నుంచి వెళ్లిపోయారు. ఫ్లోర్ లీడర్లు కలిసే వరకు తాను సభకు తిరిగి రానని చెప్పి సభనుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ హాజరు కాలేదు. బిసి సంక్షేమంపై మంత్రి ముఖేష్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాదాపు గంటన్నర సేపు సభ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. వారు ఎంతకీ వినకపోవడంతో స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు.
సభ్యుల తీరుపై స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నియమం లేదు, పద్ధతి లేదని ఆయన అన్నారు. ఇది చట్టసభనేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రవర్తన ఈ విధంగానేనా అని అడిగారు. తమాషానా ఇది అని అన్నారు. మాట్లాడమంటే మాట్లాడరు, నిరసన తెలియజేయమంటే చేయరు అని విసుక్కున్నారు. సభ ఇలా కొనసాగడానికి వీల్లేదని ఆయన అన్నారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications