రాష్ట్ర బంద్ ప్రశాంతం: స్పందన మిశ్రమం
హైదరాబాద్: వరికి మద్దతు ధరను డిమాండ్ చేస్తూ అఖిల పక్షం బుధవారం తలపెట్టిన బంద్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినహా బుధవారం మధ్యాహ్నం వరకు అవాంఛనీయమైన సంఘటనలేవీ జరగలేదు. బంద్ సందర్భంగా ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో బస్సులు యధావిధిగా నడిచాయి. కర్నూలు, తిరుపతిలలో సిపియం, తెలుగుదేశం కార్యకర్తలు రైళ్లను కొద్దిసేపు నిలిపేశారు. వరంగల్ జిల్లా మహబూబా బాద్, జనగాంలలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. మొత్తం మీద వరంగల్ జిల్లాలో బస్సుల రాకపోకలపై బంద్ ప్రభావం పెద్దగా లేదు. విజయవాడలో డిపో వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారిపై ఆందోళనకారులు ట్రాఫిక్ ను అడ్డుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. అనకాపల్లి బెల్లం మార్కెట్ ను మూసేయించారు. గన్నవరంలో మంత్రి రోశయ్యను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తిరుపతిలో చెన్నై - సికింద్రాబాద్ సప్తగిరి ఎక్స్ ప్రెస్సు రైలును కాసేపు నిలిపేశారు. ఖమ్మం - కోదాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. నల్లగొండలో ఆందోళనకారులు డిపో ధర్నాకు దిగి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా ముగిగొండలో ఆందోళనకారులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాణిజ్య సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. ఆందోళనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తూ దుకాణాలను మూసేయిస్తున్నారు. పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని అమీర్ పేటలో పోలీసులు 50మంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేసారు. ఆందోళనకారులు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తిరుపతిలో జరిగిన రాస్తారోకోలో సిపిఐ కార్యదర్శి కె. నారాయణ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications