ఈరోజు ఇరాన్ పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్
శాంతి ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసుకోకపోతే ఇరాన్ పై మరింత తీవ్రమైన దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం హెచ్చరించారు. ఇరాన్ చర్చల్లో అనవసరంగా జాప్యం చేస్తోందని, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఈ కీలక ఒప్పందం విషయంలో ఇరాన్ అప్రమత్తంగా లేదని ఆయన పేర్కొన్నారు.
"ఇరాన్ మాటలే తప్ప చేతలు లేవు" అని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు. "ఇరాన్ కు మేలు చేసే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో వారు చాలా ఆలస్యం చేశారు. ఇకపై వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "మేము వారిపై దాడి చేస్తాం, అది చాలా తీవ్రంగా ఉంటుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్ అందించిన కథనం ప్రకారం.. "మేము నిన్ననే గట్టి దెబ్బ కొట్టాం.. ఈరోజు కూడా అలాగే చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. వాషింగ్టన్ తో దౌత్య సంబంధాలను పునః సమీక్షించుకుంటామని తెహ్రాన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా, జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. హార్మూజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ ఆరోపించిన తర్వాత జరిగిన ఈ పరిణామాలు, ఏప్రిల్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
తమ అపాచీ హెలికాప్టర్ ను కూల్చివేయడానికి ప్రతిచర్యగా, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, సర్వేలైన్స్ రాడార్ స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ వివరించింది. ఈ చర్యను 'ప్రతిచర్య' అని అమెరికా వర్గాలు అభివర్ణించాయి. అపాచీ హెలికాప్టర్‌లోని సిబ్బందిని డ్రోన్ బోట్ ద్వారా సురక్షితంగా రక్షించగలిగామని అధికారులు తెలిపారు. ఇరాన్ జరిపిన దాడుల వల్ల అమెరికా స్థావరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

దాదాపు అన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలే ఇజ్రాయెల్‌తో జరిగిన దాడుల తర్వాత, తాజాగా ఇరాన్-అమెరికా మధ్య చోటుచేసుకున్న ఈ ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో శాంతి చర్చల భవిష్యత్తుపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications