సూర్యాపేట దంపతులను చంపి పూడ్చిన కేసు.. దర్యాప్తులో పాల్గొన్న పోలీసే హంతకుడు
సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాలో దంపతులను చంపి పాతిపెట్టిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో పాల్గొన్న పోలీస్ ఈ కేసులో నిందితుడు కావడం, సినిమాలను మించిన షాకింగ్ ట్విస్ట్ గా మారింది. అసలు ఇంతకీ కేసులో ఏం జరిగిందంటే
కానిస్టేబుల్ తో పరిచయం.. ఆపై అక్రమ సంబంధం
సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులు మోతెలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఒక కూతురి పంచాయతీ విషయంలో ఈ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా, అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ తో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బూబాతో అక్రమ సంబంధానికి దారితీసింది.

ఇచ్చిన డబ్బు అడిగితే అక్రమ సంబంధం బయటపెడతామని బెదిరింపులు
ఆపై వీరికి కానిస్టేబుల్ షరీఫ్ మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల షరీఫ్ కు వివాహం నిశ్చయమైంది. అయితే అప్పు తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అప్పు చెల్లించకుండా, డబ్బులు అడిగితే తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతామంటూ బెదిరించారు.దీంతో దంపతులను అడ్డు తొలగించుకోవాలని షరీఫ్ పథకం వేశారు.
ఒకసారి చేసిన ప్రయత్నం విఫలం కాగా, మరోమారు దంపతులను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఈనాడు 11వ తేదీ రాత్రి షరీఫ్ అదే పోలీస్ స్టేషన్లో హెల్పర్ గా పనిచేసే సుందరయ్యతో కలిసి నాగుని తీసుకువచ్చి నిందితులు కర్రతో కొట్టి హత్య చేశారు .ఆ తర్వాత సుందరయ్య ఇంటి వద్ద ఉన్న బూబాను బైక్ పైన తీసుకొచ్చాడు. భర్త కనిపించకపోవడంతో ఆమె కేకలు వేసింది.
చంపి పాతిపెట్టి ఏమీ తెలీనట్టు విధుల్లో పాల్గొన్న పోలీస్
వెంటనే షరీఫ్ ఆమెను కూడా కర్రతో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత దంపతుల మృతదేహాలను భూమిలో పూడ్చి పెట్టారు. స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో మోతె పోలీసులు జిల్లా ఎస్పీ నరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులలో షరీఫ్ కూడా ఉన్నాడు. సాధారణ విధుల్లో పాల్గొని తనకేమీ తెలియదు అన్నట్టుగా సంఘటన స్థలాన్ని సందర్శించాడు.
ఆర్ధిక లావాదేవీలు, వివాహేతర సంబంధమే కారణం
సీసీ కెమెరాలు, కాల్ డేటా పరిశీలనలో సుందరయ్య పట్టుబడగా, సుందరయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన వివాదంతో పోలీస్ కానిస్టేబుల్ షరీఫ్ వారిని హత్య చేసినట్టు బయటపడింది. అయితే నిందితుడు షరీఫ్ ఇంకా ప్రొబేషనరీ పీరియడ్ లోనే ఉన్నాడని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. సినిమా కథలను మించి చోటు చేసుకున్న ఈ క్రైమ్ ప్రస్తుతం సూర్యాపేటలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.













Click it and Unblock the Notifications