సిక్ లీవ్ నిరాకరణ.. ఆఫీస్ వాష్ రూమ్ లోనే మహిళా ఉద్యోగి మృతి
పని ఒత్తిడి, ఉద్యోగాల్లో వర్క్- లైఫ్ బ్యాలెన్స్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తరుణంలో.. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జోహన్నెస్ బర్గ్ కు చెందిన 29 ఏళ్ల గ్సినా ద్లాంద్లా అనే మహిళ.. ఆఫీస్ వాష్ రూమ్ లోనే ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కార్‌ట్రాక్ అనే వాహన ట్రాకింగ్ సంస్థలో ఆమె కాల్ సెంటర్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు.
దాదాపు రెండేళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న గ్సినా.. తీవ్ర ఒత్తిడి, అలసటతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న సమయాల్లో సెలవు కావాలని పదేపదే కోరినా, యాజమాన్యం దానిని నిరాకరించిందని వారు వాపోతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె విధులకు హాజరు కావాలనే నిబంధనను యాజమాన్యం అమలు చేయడం వల్లే ఈ దుస్థితి సంభవించిందని సమాచారం.
సెలవుకు దరఖాస్తు చేసుకునే క్రమంలో గ్సినా.. రెండుసార్లు మెడికల్ సర్టిఫికేట్ లను సమర్పించినా యాజమాన్యం పట్టించుకోలేదని, పైగా నొప్పి తగ్గించే మందులు ఇచ్చి పనిలో చేరాలని సూచించారని ఆమె బంధువు నోముసా ద్లాంద్లా పేర్కొన్నారు. "గ్సినా తీవ్రమైన అలసటతో, మానసిక క్షోభతో ఉన్నారు. వారాంతాలతో కలిపి సుదీర్ఘ గంటల పాటు పనిచేశారు" అని ఆమె చెప్పారు. సెలవు అడిగినందుకు ఆమెకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కంపెనీ వివరణ
గ్సినాకు నొప్పి నివారణ మందులు ఇచ్చి తిరిగి పనిలోకి పంపిన కొద్దిసేపటికే, ఆమె వాష్ రూమ్ లో కుప్పకూలిపోయారు. అయితే.. ఆమెను పని నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారనే ఆరోపణలను కార్ ట్రాక్ సంస్థ ఖండించింది. ఆమె అస్వస్థతకు గురైనప్పుడు తాము వెంటనే స్పందించామని, ఆన్ సైట్ ఫస్ట్ రెస్పాండర్స్ ద్వారా తక్షణమే అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని కార్ ట్రాక్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ లారెన్ హ్యూమన్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో నిరసన
ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆఫీసుల్లోని విషపూరిత వాతావరణం, ఉద్యోగుల పట్ల కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులను యంత్రాల మాదిరిగా, కేవలం నెంబర్స్ గానే చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో కఠినతరమైన చట్టాలు రావాలని, కార్మికుల రక్షణకు ప్రాధాన్యత పెంచాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications