ఆర్డినెన్స్ జారీ చేస్తాం: అరుణకుమారి
హైదరాబాద్: మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ఆస్పత్రుల రక్షణకు ఆర్డినెన్సును జారీ చేస్తామని ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి హామీ ఇచ్చారు. నయాపూల్ అస్పత్రిలోని పరిణామాలను ఆమె ఆదివారంనాడు సమీక్షించారు. నయాపూల్ అస్పత్రిలో వైద్య సేవలకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆమె చెప్పారు. ఆర్డినెన్సును జారీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నందున జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించాలని ఆమె కోరారు.
ఆర్డినెన్సు జారీపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బెంగుళూర్ నుంచి రాగానే ఒక అధికారిక ప్రకటన చేస్తారు. వైద్యులపై దాడి చేసినవారికి మూడేళ్లు జైలు శిక్ష పడేలా ఆర్డినెన్స్ తేనున్నారు. నయాపూల్, నీలోఫర్ ఆస్పత్రుల్లో కూడా రక్షణ కల్పిస్తామని అరుణకుమారి చెప్పారు. ప్రభుత్వం రక్షణ కల్పించలేని స్థితిలో తమకు గన్ లైసెన్సులు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు హైదరాబాద్ పోలీసు కమీషనరును కోరారు. ఈ మేరకు వారు కమీషనరుకు ఒక లేఖ రాశారు. జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రులు ఉస్మానియా వైద్య కళాశాలలో సమావేశమై దాడులను ఖండించారు.












Click it and Unblock the Notifications