ఎబోలా వైరస్ పై కేంద్రం అలర్ట్.. భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా
ఆఫ్రికాలోని దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే భారత్ కు వచ్చిన 21 రోజుల లోపు ఎవరైనా ఎబోలా లక్షణాలతో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, తమ ట్రావెల్ హిస్టరీని అధికారులకు వెల్లడించాలని సూచనలు చేసింది. ఇక ఎబోలా వైరస్ కు సంబంధించిన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
మరోవైపు ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో జరగాల్సిన నాలుగో భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ లో ఎబోలా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సదస్సును వాయిదా వేయడంపై భారత్- ఆఫ్రికన్ యూనియన్ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో సదస్సును మరో తేదీకి మార్చడమే మంచిదని ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. ఇక ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను అదుపు చేయడానికి ఆఫ్రికా సీడీసీ తీసుకుంటున్న చర్యలకు భారత్ పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించింది.

ఇక ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కాంగోలో తాజాగా 513 అనుమానిత ఎబోలా కేసులు, 131 అనుమానిత మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. వైరస్ తీవ్రత దృష్ట్యా జోర్డాన్ ఇప్పటికే కాంగో, ఉగాండా ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇక ఎబోలా వైరస్ విషయానికి వస్తే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదు. అంటే కొవిడ్ -19 లాంటిది కాదు. నేరుగా తాకడం, జంతువుల ద్వారా వ్యాప్తి, కలుషిత వస్తువుల ద్వారా వస్తుంది. లక్షణాలు చూస్తే.. జ్వరం, వాంతులు, తీవ్రమైన నీరసం, విరేచనాలు, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పి, వివరించలేని రక్తస్రావం వంటివి శరీరంలో కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications