అయేషా హత్యపై అసెంబ్లీలో దుమారం
హైదరాబాద్: విజయవాడలో విద్యార్థిని అయేషా హత్య కేసుపై మంగళవారం శాసనసభలో దుమారం చెలరేగింది. అయేషా హత్య కేసుపై ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా తెలుగుదేశం, మజ్లీస్, వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయేషా హత్య కేసులో ప్రభుత్వ వైఫల్యం లేదని హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. ఈ కేసును స్థానిక పోలీసులే దర్యాప్తు చేస్తున్నారని, కేసు దర్యాప్తు బాధ్యత విజయవాడ కమీషనర్ సి.వి. ఆనంద్ దేనని ఆయన అన్నారు. స్థానిక పోలీసులు సిబిసిఐడిలోని నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఉన్నతాధికారులతో విచారణ జరిపించి కేసు దర్యాప్తులో స్థానిక పోలీసుల వైఫల్యం ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
అయేషా హత్య కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారో కూడా తెలియడం లేదని అంతకుముందు తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. అన్ని ఆధారాలున్నప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. అయేషా హత్య కేసును సమర్ధంగా దర్యాప్తు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. అయేషాపై అఘాయిత్యం జరిగిందనడానికి ఆధారాలున్నప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడం లేదని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications