సంజు శాంసన్‌కు స్పాట్ పెట్టారు: హెచ్చరించిన మంజ్రేకర్: ఇకపై
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సరికొత్త సవాలును ఎదుర్కొంటోంది. బెల్ ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూడటమే కాకుండా, జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్ల ఆటతీరుపై కూడా తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ కే అవుట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘోర పరాజయం అనంతరం భారత జట్టు మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. సంజు శాంసన్‌కు వైభవ్ సూర్యవంశీ రూపంలో అత్యంత ప్రమాదకరమైన సవాల్ పొంచి ఉందని, అందుకే చాలా అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫామ్ నిలుపుకోకపోతే ఓపెనింగ్ రేసులో వెనుకబడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ 183 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. దీన్ని అందుకోలేక చతికిలపడింది టీమిండియా. 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సంజు శాంసన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి జై మూంద్రా వేసిన ఇన్‌స్వింగర్ కు వికెట్ కోల్పోయాడు. శాంసన్‌పై ఎడమచేతి వాటం బౌలింగ్ బలహీనత మరోసారి బహిర్గతం కాగా, అభిషేక్ శర్మ మాత్రం 19 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
సమీప భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ రంగప్రవేశం చేస్తే శాంసన్ స్థానానికి ముప్పు వాటిల్లనుంది. ఈ యువ సంచలనం ఐపీఎల్ లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, తన దూకుడైన ఆటతీరుతో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాదాడు. ఇండియా-ఏ జట్టు తరఫున డంబుల్లాలో శ్రీలంక-ఏ జట్టుపై ఆడుతూ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి అదరగొట్టాడు.
ఇదే విషయాన్ని సంజయ్ మంజ్రేకర్ ప్రస్తావించారు. తొలి మ్యాచ్‌లో వైభవ్ కు అవకాశం కల్పించకపోవడం సరైన నిర్ణయమేనని సమర్థించారు. బెల్ ఫాస్ట్ పిచ్ బ్యాటింగ్‌కు అంత సులభంగా లేదని, ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో పరుగుల వేట కొనసాగించడం కష్టమని వ్యాఖ్యానించారు. డంబుల్లాలో జరిగిన ట్రై- సిరీస్‌లో కూడా సూర్యవంశీ సిక్సర్లు కొట్టడానికి ఇబ్బంది పడ్డాడనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతానికి సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు మరికొద్ది కాలం జట్టు యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు లభించవచ్చని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ సూర్యవంశీని మిడిలార్డర్ స్థానాల్లో లేదా లోయర్ ఆర్డర్‌లో ఆడించాలని భావిస్తే తప్ప టాప్ ఆర్డర్‌లో వైభవ్‌కు అవకాశం దక్కడం అంత సులభం కాదని విశ్లేషించారు. అందుకోసం వైభవ్ తన అరంగేట్రం నిమిత్తం కొంత కాలం వేచి ఉండాలని సూచించారు.
భారత జట్టు తన తదుపరి పోరులో జూన్ 28న ఐర్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. సిరీస్ సమం చేయడమే ఏకైక లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌తో భారీ సిరీస్ కోసం జట్టు ప్రయాణం కానుంది. ఈ తరుణంలో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందనే ఉత్కంఠ నెలకుంది.












Click it and Unblock the Notifications