రైల్వే బడ్జెట్ పై వైయస్ సంతృప్తి
హైదరాబాద్: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదించిన బడ్జెట్ పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రానికి మూడు కొత్త రైళ్లు ప్రకటించారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్, తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం హర్ష దాయకమని ఆయన అన్నారు.
రైల్వే బడ్జెట్టులో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి బడ్జెట్టులో అన్యాయం జరిగిందని, తమిళనాడుకు మాత్రం చాలా ప్రాజెక్టులు కేటాయించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్టులో రాష్ట్రానికి పంగనామాలు పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications