సీనియర్లను చూస్తే సిగ్గు: ముఖేష్
హైదరాబాద్: తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులపై బిసి సంక్షేమ మంత్రి ఎం. ముఖేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్లను చూస్తే సిగ్గేస్తోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీనియర్లు పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయమ విమర్శించారు. ఎన్నికలు వస్తే తాము గెలవలేమని భయపడుతున్న సీనియర్లు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ సెంటిమెంటు అంతంత మాత్రంగానే ఉందని, తెరాస ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ 16 స్థానాలలో పదికి పైగా స్థానాలను దక్కించుకుంటుందని, నాలుగైదు స్థానాలు పోతే పోతాయని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ మంత్రుల్లో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే పద్ధతిలో సీనియర్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తమకు మంచి దారిన నడిపించడానికి బదులు సీనియర్లే చెడు దారులు తొక్కుతున్నారని ఆయన అన్నారు. ముఖేష్ ను మరో మంత్రి టి. జీవన్ రెడ్డి సమర్థించారు.












Click it and Unblock the Notifications
